ముగిసిన 'నీట్-2019' పరీక్ష

ముగిసిన 'నీట్-2019' పరీక్ష

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)-2019 పరీక్ష కాసేపటి క్రితం ముగిసింది. ఈ పరీక్ష నిర్వహణకు సీబీఎస్‌ఈ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షకు రెండు గంటల ముందునుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జూన్ 5న నీట్ ఫలితాలను వెల్లడించనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2 లక్షల మంది అభ్యర్థులు అధికంగా నీట్ పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది నీట్ పరీక్షలకు 13.26 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది 15.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికోసం దేశవ్యాప్తంగా 154 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒడిషాను అతలాకుతలం చేసిన 'ఫణి' తుపాను కారణంగా ఒడిషాలో నీట్ పరీక్షను అధికారులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహించనున్నది వెల్లడించనున్నారు.