ఆనం మనసు మార్చుకున్నారా? 

ఆనం మనసు మార్చుకున్నారా? 

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోనే కొనసాగే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ.. వైసీపీకి దగ్గరవుతున్నారా అన్న అనుమానాన్ని ప్రజల్లో కలిగించిన ఆనం సోదరుడు రామనారాయణ రెడ్డి ఎట్టకేలకు టీడీపీలోనే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ మధ్య ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరనున్నట్లు విపరీతంగా ప్రచారం సాగింది. అయితే వారి ఆశలను నీరుగారుస్తూ... ఆయన టీడీపీలోనే ఉండాలని తీర్మానించుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన వైసీపీలో తప్పక చేరుతారని, 2019 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనే వైసీపీతో ప్రతిష్టంభన నెలకొందని, అది మినహా వైసీపీలో చేరడం ఖాయమైందని ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు ఆనం టీడీపీలోనే ఉండే నిర్ణయం తీసుకున్నారు. ఆనం టీడీపీలోనే కొనసాగడానికి మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. టీడీపీలో కొనసాగేందుకు అంగీకరించారు. టీడీపీ స్థానిక నేతలతో ఆయన భేటీయై పార్టీ కార్యక్రమాలు, మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్నారు.  మే 14వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. మే 19న ఆత్మకూరులో మినీమహానాడు నిర్వహించనున్నారు.