'తలైవి' ఫస్ట్‌లుక్.. నెటిజన్ల విమర్శలు..

'తలైవి' ఫస్ట్‌లుక్.. నెటిజన్ల విమర్శలు..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్‌ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చచీరలో అభివాదం చేస్తున్న బ్యానర్‌ను ఈ తొలి ప్రచార చిత్రంలో చూపించారు. అయితే పోస్టర్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాలో జయలలితగా కంగన నటిస్తుండగా.. ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ను కంగనా రనౌత్‌ పోషించడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. నటన విషయంలో కంగనాను ఎవరూ వేలెత్తి చూపలేరు. కాకపోతే... పీలగా ఉండే కంగనా జయలలిత పాత్రలో ఇమడలేకపోయారన్నది పలువురి అభిప్రాయం. మరీ ముఖ్యంగా సినిమాల్లో కూడా బొద్దుగా జయలలిత... రాజకీయాల్లోకి వచ్చాక ఇంకా లావయ్యారు. అయితే, ఫస్ట్‌ లుక్‌లో కంగనా ముఖం నిండుగా కనిపించినా... శరీరం మరీ సన్నగా ఉండడంపై పురిచ్చి తలైవి అభిమానులు పెదవి విరుస్తున్నారు.