కరోనా అడ్డేకాదు..? భారీగా పెరిగిన బిలియనీర్లు..

కరోనా అడ్డేకాదు..? భారీగా పెరిగిన బిలియనీర్లు..

కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కానీ, అదే సమయంలో కొత్త సంపన్నుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని ఫోర్బ్స్ మ్యాగజీన్ తెలిపింది. ఓపక్క మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ప్రపంచ ధనవంతుల సంపద రికార్డు స్థాయిలో 5 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా, మునుపెన్నడూ లేనంతమంది కొత్త కోటీశ్వరులు ఈ జాబితాలో చేరారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులున్ననగరం బీజింగ్‌. ఈ ఏడాది 100 బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత ఏడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న న్యూయార్క్ సిటీని కూడా బీజింగ్ ఈసారి వెనక్కి నెట్టేసింది. న్యూయార్క్ సిటీ నుంచి 99 మంది ఈ ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. 

ఇక, ప్రపంచంలో అత్యధిక మంది బిలీయనీర్లు ఉన్న మూడో దేశం భారత్‌. ఇండియా నుంచి 140 మంది కోటీశ్వరులు ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. ఇక దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నిలిచారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. ముఖేష్‌ అంబానీ ఆస్తి 84.5 బిలియన్‌ డాలర్లు. ఇక రెండో స్థానంలో గౌతమ్‌ ఆదానీ, మూడో స్థానంలో శివ నాడార్‌ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లిస్ట్‌లో జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 177 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. బెజోస్ ఆస్తి గత ఏడాది కంటే 64 బిలియన్ డాలర్లు పెరిగి, 177 బిలియన్ డాలర్లకు చేరింది. 2020లో 31వ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ 2021కల్లా రెండో స్థానానికి దూసుకొచ్చారు. మస్క్‌ సంపద 151 బిలియన్ డాలర్లు. ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 3వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జూకర్‌బర్గ్ వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచారు.