తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్..! రెండు రోజుల్లో ప్రకటన..!

తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్..! రెండు రోజుల్లో ప్రకటన..!

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఒకటి రేండు రోజుల్లోనే టీపీసీసీకి  కొత్త చీఫ్ ఎవరనేది తేలిపోతుంది. ఇప్పటివరకు... అధిష్టానం పరిశీలనలో ముగ్గురి పేర్లు ఉన్నాయి. మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల పేర్లు అధిష్టానం పరిశీలిస్తోంది. పార్టీ విధేయుడికే పట్టం కట్టాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ జనంలో ఉన్న క్రేజ్‌ని పరిగణనలోకి తీసుకుంటే పీసీసీ నియామకం మరోవిధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు  భావిస్తున్నాయి. 

ఇక, తెలంగాణకు పీసీసీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్... ఢిల్లీ వెళ్లారు. పార్టీ ముఖ్యులను కలిశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరే ప్రయత్నాలు చేస్తున్నారు అంజన్. అయితే, అంజన్‌కి హైకమాండ్ నుంచి సానుకూల స్పందన మాత్రం  కనిపించటంలేదట. ప్రస్తుతం తెలంగాణకి పార్టీ అధిష్ఠానం పీసీసీతోనే సరిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఒకటి రెండు రోజుల్లో టీపీసీసీ ఎవరన్నది తెలిపోనుంది. అయితే అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుంది? అనేదే ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది. అసలు ఒకటి.. రెండు రోజుల్లోనే తెలిపోతుందా..? ఢిల్లీ ఎన్నికలు అయ్యేంతవరకు టీపీసీసీ ఎంపిక ప్రక్రియ ఆగుతుందో చూడాలి మరి.