కరోనా కొత్త స్ట్రెయిన్.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ

కరోనా కొత్త స్ట్రెయిన్.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ

కరోనా వైరస్ యూకే స్ట్రెయిన్ విస్తరిస్తుండటంతో మరోమారు కోవిడ్ నిబంధనల అమలుపై మార్గదర్శకాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ... అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తున్న తరుణంలో యూకే స్ట్రెయిన్ కేసులు జిల్లాల్లో విస్తరిస్తుండటంతో తాజా మార్గదర్శకాల విడుదల చేసినట్టు పేర్కొంది. ఆస్పత్రుల్లో జరుగుతున్న చికిత్సలు, కేసుల పెరుగుదల తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్.. రాష్ట్రంలోని ప్రతీ కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని సూచనలు చేసింది.. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని.. తక్షణం రోగుల భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆగ్నిమాపక శాఖ నుంచి తక్షణం ఎన్‌వోసీ తీసుకోవాల్సిందిగా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్19కు ఉచితంగానే చికిత్స అందుతోందని.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చికిత్స అందించాల్సిందిగా సూచించింది వైద్యారోగ్యశాఖ.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కోవిడ్ నియంత్రణ కోసం జారీచేసిన నిబంధనలు కఠినంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్కు ధరించేలా చూడాలని స్పష్టం చేసింది.. గతంలో చేపట్టిన మాస్కే కవచం కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల్లో  భాగంగా జన సమూహాలకు అనుమతి నిరాకరణ, కంటైన్మెంట్ వ్యూహాన్ని అనుసరించాలని సూచనలు చేయగా.. సంక్రాంతి పండుగ దృష్ట్యా భారీగా జనసమూహాలు పోగుపడకుండా చూడాలని పేర్కొంది.. అయితే, ఇది సాధ్యం కాని సమయంలో కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవలని సూచించింది.. నమూనా సేకరణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 1519 ప్రాంతాలను మరింతగా వికేంద్రీకరించి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించిన సర్కార్.. కరోనా టోల్ ఫ్రీ నెంబరుగా 104ను కొనసాగించాలని మరింతగా వైద్య సేవలను అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల నోటిపై చేయటంతో పాటు ఫీవర్ క్లీనిక్కుల నిర్వహణ, కాంట్రాక్టు ట్రేసింగ్, ఇంటింటి సర్వే నిర్వహణ, లక్షణాలు ఉన్నవారిని గుర్తించటం వంటి కార్యాచరణ చేపట్టాల్సిందిగా.. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, మృత దేహాల అంత్యక్రియల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 వేలను మృతుల కుటుంబాలకు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది.