మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు ఇవే..

మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు ఇవే..

అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రయాణికులతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రో రైలు కార్పొరేషన్లు అనుసరించాల్సిన విధి విధానాలను విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి 12వ తేదీలోపు అన్ని మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. ఢిల్లీలో మెట్రో సేవలు మూడు కేటగిరిల్లో ప్రారంభవుతాయని కేంద్రం చెప్పింది. 

మెట్రో రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడూ ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వద్ద ఉన్న మెట్రో స్టేషన్లను మూసి ఉంచాలని ఆదేశించింది. స్టేషన్లలో, ప్లాట్‌ఫాంలపైనా, మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించాలని, అందుకు తగిన విధంగా భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని సూచించింది. మాస్కులు లేకుండా ఏ ఒక్కరినీ మెట్రో స్టేషన్లలో, రైళ్లలోకి గానీ అనుమతివ్వకూడదని తన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. ఇక, ఢిల్లీలో మెట్రో రైళ్లు సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు సిటీలో కూడా మెట్రో పట్టాలెక్కనున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది.. అయితే.. సెప్టెంబర్ 11 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న సర్వీసులను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నడపనున్నట్లు వెల్లడించారు. ఇక, హైదరాబాద్‌ మెట్రో సర్వీసులపై నేడో రేఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.