కొత్త మామిడి రకానికి అమిత్ షా పేరు!!

కొత్త మామిడి రకానికి అమిత్ షా పేరు!!

త్వరలోనే మార్కెట్లోకి కొత్త రకం మామిడి పళ్లు అమ్మకానికి వస్తున్నాయి. వీటిని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పేరు పెట్టారు. 'మ్యాంగో మ్యాన్' అని పేరుతో ప్రసిద్ధుడైన హాజీ కలీముల్లా అమిత్ షా వ్యక్తిత్వానికి ప్రభావితుడై మామిడిలోని కొత్త రకానికి 'షా' అని నామకరణం చేశారు. ఈ మామిడి రుచి, బరువులలో ఎంతో బాగుంటుందని చెబుతున్నారు. ఇది త్వరలోనే మార్కెట్లోకి రానుందని భావిస్తున్నారు. అమిత్ షాలోని సామాజికంగా వివిధ వర్గాలను దగ్గర చేయడం, ప్రజలను ఒక వేదికపైకి తీసుకురాగల సామర్థ్యం అద్భుతం అని కలీముల్లా అంటున్నారు.

టైమ్స్ నౌలో ప్రసారం చేసిన వార్తాకథనం ప్రకారం పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన కలీముల్లా 2015లో మామిడిలోని ఒక మేలు రకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అప్పుడు ప్రధానికి మామిడిపళ్లు బహూకరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈ మామిడిపళ్లు ప్రధాని మోడీకి నచ్చుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

లక్నో సమీపంలోని మలీహాబాద్ లో కలీముల్లాకి మామిడి తోటలు ఉన్నాయి. ఆయన మామిడిలో ఎన్నో కొత్త కొత్త రకాలను ఉత్పత్తి చేసి వాటికి సెలబ్రిటీల పేర్లు పెట్టడం ద్వారా ప్రసిద్ధుడయ్యారు. ఆయన తోటలో ఒక మామిడి చెట్టుకి 300 వేర్వేరు రకాల పళ్లు కాస్తాయని కూడా వార్తలు వచ్చాయి. మామిడిలో కొత్త రకం ఉత్పత్తి చేయడానికి పూలను క్రాస్ చేసి వాటి విత్తనాలను నాటుతానని ఆయన చెబుతారు. ఈ ప్రక్రియ ఎంతో సవాలుతో కూడుకున్నదని, ఇందులో సక్సెస్ రేట్ తక్కువని కలీముల్లా వివరిస్తారు. కానీ విజయవంతంగా తయారైన రకాలను చూసినపుడు వాటికి కేటాయించిన సమయం, శక్తియుక్తులు సార్థకమైనట్టు భావిస్తానని అంటారు.