మోడీ ఇకపై ఉండరు.. రాబోయేది కొత్త ప్రధానే..!

మోడీ ఇకపై ఉండరు.. రాబోయేది కొత్త ప్రధానే..!

దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. నరేంద్ర మోడీ ఇకపై ప్రధానిగా ఉండబోరని జోస్యం చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామన్న ఆయన.. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామని.. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి వీస్తోందని.. ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోడీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్రస్టేషన్‌తోనే మోడీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించిన చంద్రబాబు... 26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు..? గత ఐదేళ్లలో తానేం చేశాడో నరేంద్ర మోడీ చెప్పాలని సూచించారు. ఇక చేసింది, చెప్పేందుకేమీ లేదు కాబట్టే మోడీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందన్నారు చంద్రబాబు... నా సొంతం కోసం కాదు మోడీతో విభేదించింది.. రాష్ట్రం కోసమే బీజేపీపై తిరగబడ్డామని స్పష్టం చేశారు. ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ ద్వారా కక్షసాధింపు గతంలో లేదన్న ఏపీ సీఎం.. 5 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసమే మోడీపై తిరగబడ్డామన్నారు. ప్రజాస్వామ్యం కోసమే తొలిసారి సుప్రీంకోర్టుకు వెళ్లానన్న చంద్రబాబు.. వీవీ ప్యాట్ రశీదుల కౌంటింగ్ 50 శాతం లెక్కించాలని అడిగామని.. మన పోరాటం వల్లే ఒక బూత్ కౌంటింగ్‌ను 5 బూత్‌లకు పెంచగలిగామని తెలిపారు. కౌంటింగ్ లో తేడాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో అన్ని బూత్ లు కౌంటింగ్ చేయాలనేదే మన డిమాండ్ అని వెల్లడించారు చంద్రబాబు.