వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు..!

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు..!

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారిన మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ కోసం కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆధ్వర్యంలో కొత్త సిట్‌‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప.. ఇలా మొత్తం 23 మంది పోలీసు అధికారులతో కలిపి సిట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ టీమ్... వివేకా ఇంటిని మరోసారి పరిశీలించనుంది. కాగా, మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కింద పడిపోయి తీవ్ర గాయాలపాలై మృతిచెందినట్టు మొదట తెలిపినా... పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆయ హత్యకు గురైనట్లు తేలింది. ఈ ఘటనపై అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. ఇక కేసులో టీడీపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినా.. సర్కార్ మారడంతో ఇప్పుడు సిట్‌ను కూడా మార్చేశారు.