GHMC కొత్త కార్పొరేటర్లకు అమావాస్య టెన్షన్...

GHMC కొత్త కార్పొరేటర్లకు అమావాస్య టెన్షన్...

గెజిట్‌ విడుదల కావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు. ప్రమాణ స్వీకారం తేదీ కూడా ఫిక్స్‌ కావడంతో ఇన్నాళ్లూ నెలకొన్న ఆందోళన తొలిగిపోయింది. కానీ.. సరికొత్త టెన్షన్‌ పట్టుకుందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.

గ్రేటర్‌లో మళ్లీ రాజకీయ వేడి!

గత ఏడాది డిసెంబర్‌ 4తో గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిశాయి. 150 డివిజన్ల నుంచి కొత్త కార్పొరేటర్లు గెలిచారు. నగర ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. ఎక్స్‌అఫీషియో ఓట్లను కలుపుకొన్నా లెక్క తేలకపోవడంతో కొత్త పాలకవర్గం కొలువు తీరలేదు. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జోలికి పోకుండా.. పాత పాలకవర్గం గడువు ముగిసేవరకు ఈ అంశం కొలిక్కి రాదనే అభిప్రాయానికి వచ్చాయి పార్టీలు. ఇప్పుడు ఆ టైమ్‌ కూడా దగ్గర పడుతుండటంతో GHMCలో క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది. 

ఫిబ్రవరి 11న కొత్త పాలకమండలి కొలువు!

GHMC మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌తోపాటు విధానపరమైన సూచనలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచిన వారి జాబితాతో గెజిట్‌ ప్రకటించడంతో తదుపరి చర్యలు.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలపై SEC దృష్టి పెట్టింది. పాత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. అందుకే ఫిబ్రవరి 11న కొత్త పాలకమండలి ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఫిబ్రవరి 11 అనగానే గెలిచిన కార్పొరేటర్లలో చాలా మందికి గుండెల్లో రాయిపడిందట.  

ఫిబ్రవరి 11 అమావాస్య కావడంతో కార్పొరేటర్లలో గుబులు

ఫిబ్రవరి 11 అమావాస్య కావడంతో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి చాలా మంది కార్పొరేటర్లు వెనకంజ వేస్తున్నారట. అమావాస్య రోజు కొత్త పనులకు ఎలా శ్రీకారం చుడతామని  ప్రశ్నిస్తున్నారట. ఎన్నికల్లో గెలిచి ఇన్ని రోజులైనా తమ రాజకీయ భవిష్యత్‌ గాలిలోనే ఉంది. ఇప్పుడు గెజిట్‌ వచ్చింది. హమ్మయ్య అని అనుకుంటోన్న సమయంలో ఈ అమావాస్య గండమేంటని  తెగ గుంపుచింపులు పడుతున్నారట. ఇది ఆ నోటా..ఈ నోటా రాష్ట్ర ఎన్నికల సంఘం చెవిని పడిందట. ఇప్పటికే డేట్ ఫిక్స్‌ చేసినందున దానిని రీ షెడ్యూల్‌ చేయడం కుదరబోదని SEC వర్గాల చెబుతున్నాయి. ఒకవేళ ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేయడం ఇష్టం లేకపోతే ఆ రోజు కార్పొరేటర్లు గైర్హాజర్‌ కావొచ్చు. కోరం లేకపోతే సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేసుకునే వెసులుబాటు ఉంటుంది అని వెల్లడిస్తున్నాయి. 

కోరం ఉంటుందా? ఉండదా? 

అమావాస్య అభ్యంతరం ఒక్క బీజేపీ కార్పొరేటర్లకే కాదు.. టీఆర్‌ఎస్‌లోని కార్పొరేటర్లు సైతం ఉందట. అందుకే ఫిబ్రవరి 11న ఎంత మంది ప్రమాణ స్వీకారానికి వస్తారు? ఎంత మంది గైర్హాజర్‌ అవుతారు? కోరం ఉంటుందా? ఉండదా? అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఒకవేళ కోరం ఉంటే.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కూడా చేపడతారు. అందుకే అమావాస్య రోజున భేటీ ఏర్పాటు చేయడంలో రాజకీయ ఎత్తుగడ ఏదైనా ఉందా అని కొందరు ఆరా తీస్తున్నారట. మొత్తానికి  గ్రేటర్‌ రాజకీయం ప్రస్తుతం అమావాస్య చుట్టూ తిరుగుతోంది. మరి.. ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి.