కలకలం రేపుతున్న బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

కలకలం రేపుతున్న బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

 హైదరాబాద్ నల్లకుంటలో భార్యను చంపి తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మాధవ్ సిండికేట్ బ్యాంకు హైదరాబాద్ నల్లకుంట శాఖలో అసిస్టెంట్ మేనేజన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య సుమలతతో కలసి నల్లకుంట శంకర్‌మఠ్ సమీపంలోని అరోవిల్లా అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. కాగా వీరి పెళ్లి అయినప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పెళ్లయిన రెండు నెలలకే సుమలత గర్భవతి అయింది. వైద్యులు మెట్లు ఎక్కవద్దని సూచించడంతో గత ఐదు నెలల నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. 

వారం కింద అత్తగారింటికి వెళ్లిన మాధవ్ గొడవకు దిగాడు. తన భార్యను తనతో పంచించాలని బంధువులతో అడిగాడు. దీంతో సుమలతను తీసుకొని అమె తల్లి లింగమ్మ హైదరాబాద్ చేరుకుంది. నల్లకుంటలోని మాధవ్ ఇంటికి వచ్చి రెండు రోజుల పాటు ఇంట్లో ఉండి అల్లుడి సర్ధి చెప్పి అమె తిరిగి వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మళ్లీ మొదలయ్యాయి.

శనివారం మధ్యాహ్నం విద్యానగర్-జామేఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీస్ రైలు కింద పడి మాధవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాచిగూడ రైల్వే పోలీసులు మాధవ్ తండ్రి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బంధువులు శనివారం రాత్రి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా గదిలో సుమలత శవమై కనిపించింది. మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

భార్యభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం. ఆవేశంతో మాటకు మాట అనుకుని రగలిపోలి పోయి సాధించేది ఏమీ లేదు. నా మాటే నెగ్గాలనే పంధాలో వెళ్లితే చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారుతుంది. అంతేకాదు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, గౌరవించుకుంటూ ఉంటే గొడవలు రాకుండా ఉంటాయి. దీంతో ఇరువురికి అర్ధం చేసుకునే మనస్తత్వం ఏర్పడి.. అది అన్యోన్య జీవనానికి దారితీస్తుంది. అప్పుడు అగ్ని సాక్షిగా ఒక్కటైన వారు జీవితాంతం అన్యోన్యంగా ఉండగలరు.