'దిశ' ఎన్‌కౌంటర్ కేసులో మరో ట్విస్ట్...! గాంధీకి మృతదేహాలు..

'దిశ' ఎన్‌కౌంటర్ కేసులో మరో ట్విస్ట్...! గాంధీకి మృతదేహాలు..

సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ కేసులో విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు... నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలోనే నిందితుల మృతదేహాలను భద్రపర్చాలని స్పష్టం చేసింది హైకోర్టు. సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున కేసు వాయిదా వేసిన హైకోర్టు... సీనియర్‌ లాయర్ ప్రకాష్‌రెడ్డిని మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని సూచించింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాతే.. గురువారం రోజు విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, ఈ లోపు ఎఫ్‌ఐఆర్ కాఫీలు, డాక్యుమెంట్లు, పోస్టుమార్టం వీడియోకు సంబంధించిన సీడీలు సమర్పించాలని ఆదేశించింది. 

దీంతో నిందితుల మృతదేహాలకు మరోసారి బ్రేక్ పడినట్టు అయ్యింది. శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరగగా... అదే రోజు సాయంత్రానికి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు.. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు, హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియలు నిలిచిపోయి. దీంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన ప్రాంతంలో ఆ తర్వాత మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో మృతదేమాలను భద్రపరిచారు. హైకోర్టు విచారణ తర్వాత ఇవాళ మృతదేహాలను బంధువులకు ఇస్తారని అంతా భావిస్తున్న సమయంలో.. హైకోర్టు మరోసారి ఈ కేసు వాయిదా వేసింది.. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. దీంతో మరోసారి అంత్యక్రియలకు బ్రేక్‌లు పడగా.. మహబూబ్‌నగర్ నుంచి గాంధీకి నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు అధికారులు.