దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో ట్విస్ట్..! ఢిల్లీకి నిందితుల మృతదేహాలు...?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో ట్విస్ట్..! ఢిల్లీకి నిందితుల మృతదేహాలు...?

హైదరాబాద్‌ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం, దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది... ఇక, ఈ కేసులో ఉన్న నలుగురు నిందితుల ఎకౌంటర్‌ సంచలనం సృష్టించింది. ఓవైపు తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురవగా... మరోవైపు విమర్శలు కూడా వచ్చాయి... ఎన్‌కౌంటర్ జరిగిన రోజే పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల జోక్యంతో నిందితుల అంత్యక్రియలు నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇప్పుడు ఆ నాలుగు మృతదేహాలను ఢిల్లీకి తరలించాల్సిన పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో ఉంచారు... ఆ మృతదేహాలను ఎంత ఫ్రీజింగ్‌లో భద్రపరచినప్పటికీ, ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ కొన్ని సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయట... దీంతో ఆ మృతదేహాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వాటిని భద్రపరచడం తమ వల్ల కాదని గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తుండగా.. అవి కుళ్లిపోతే రీపోస్టుమార్టం జరపడానికి కూడా అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు. దీంతో... ఆ మృతదేహాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గాంధీ ఆస్పత్రి వైద్యులు కోరినట్టుగా తెలుస్తోంది. ఎయిమ్స్‌కి తరలిస్తే ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ ఎలాంటి నష్టం ఇబ్బంది ఉండదనే నిర్ణయానికి వచ్చి.. ప్రభుత్వ అనుమతి కోరినట్టు సమాచారం. మరి తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించి.. అనుమతిస్తే మాత్రం.. త్వరలోనే ఆ నాలుగు మృతదేహాలు ఢిల్లీకి తరలించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. మృతదేహాల నిర్వహణ ఖర్చు కూడా భారీగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఖరీదైన ఇంజక్షన్లతో పాటు... భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో ఈ ఇబ్బంది తలెత్తినట్టుగా చెబుతున్నారు.