నిమ్మగడ్డ రమేష్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్..

నిమ్మగడ్డ రమేష్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్..

ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. హైకోర్టు తీర్పు రాగానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి... విధుల్లో చేరినట్టు ప్రకటించారు నిమ్మగడ్డ. అయితే... నిమ్మగడ్డను నిలువరించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు ఎస్ఈసీ కేంద్రంగా జారీ అవుతున్న సర్క్యులర్లు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌నే తిరిగి కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు జరిగిన పరిణామాలు ఒకెత్తయితే... ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు మరో ఎత్తు. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టానంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు నిమ్మగడ్డ. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అందరితో సంప్రదింపులు జరుపుతానని స్పష్టం చేశారాయన. దీనిని బట్టి సోమవారం ఏపీ ఎస్ఈసీ కార్యాలయానికి నిమ్మగడ్డ వచ్చే సూచనలు ఉన్నాయనే ప్రచారం జరిగింది.

అయితే, నిమ్మగడ్డ వ్యవహారంలో సర్కులర్లు జారీ కావడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామంటూనే... కొత్త విషయాలను తెర మీదకు తెచ్చింది ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా నిమ్మగడ్జ వ్యవహరించారని చెబుతోంది. అసలు 2016లో నిమ్మగడ్డ నియామకమే చెల్లదనే కొత్త విషయం చెబుతోంది ప్రభుత్వం. మరో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్‌ బాధ్యతలు తీసుకున్నారంటూ ముందు రోజు ఇచ్చిన సర్కులర్ 317ను ఉప సంహరించుకున్నారు ఎస్ఈసీ కార్యదర్శి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరనే సందిగ్దం కొనసాగుతుంటే... ఎస్ఈసీ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి వాణి మోహన్‌ను నియమించింది సర్కార్. దీంతో నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.