విజయారెడ్డి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

విజయారెడ్డి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

అబ్దుల్లాపూర్ మెంట్ ఎమ్మార్వో హత్యకేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనాస్థలం నుండి దాదాపు ముప్పై శాంపిళ్లను సేకరించిన క్లూస్ టీం ఫోరెన్సిక్ ల్యాబుకు పంపించారు. అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులు నిందితుడు సురేష్ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయం పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్ సీసీ టీవీ ఫుటేజును కూడా తీసుకున్న పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వనస్థలిపురం ఏసీపీ జయరాం ఆధ్వర్యంలో ఈ కేసు  విచారణ సాగుతోంది.

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో భద్రతా సిబ్బందిని ఉంచాలని నెల రోజుల నుంచి తహసీల్దార్  జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. వివాదాస్పద భూముల ఆందోళనలను విజయారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సురేష్ కుటుంబానికి చెందిన తొమ్మిది గుంటల భూమే వివాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.  ఈ భూమిని సురేష్ కుటుంబం  ఒక మాజీ ప్రజాప్రతినిధికి అమ్మింది. దీనిపై గ్రామసభల్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో గతంలో సురేష్ గొడవకు దిగాడు, ఇక హత్య చేసిన రోజు సురేష్ చాలా మందితో ఫోన్‌లో మాట్లాడాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వారిలో ఉన్నారు. హత్యకు కొద్ది నిమిషాల ముందు పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడాడు.

ఇప్పటికే దుర్గయ్యతో పాటు సురేష్ తండ్రి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత సురేష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేదారిలో ఆగి ఉన్న ఓ కార్లోని వ్యక్తులతో ఐదు నిమిషాలు మాట్లాడినట్టు భావిస్తున్నారు. అలాగే సంఘటనా స్థలంలో సురేష్ తో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కార్లోని వ్యక్తులు, సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరన్నదానిపై విచారణ కొనసాగుతోంది. కాలిన గాయాలతోఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సురేష్ తీవ్రంగా గాయపడ్డాడని, శరీరంలో నీరే లేదని వైద్యులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు ఇవాళ మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి సురేష్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీయనున్నారు.