మారని టీమిండియా తీరు.. రికార్డు సృష్టించిన న్యూజిలాండ్

మారని టీమిండియా తీరు.. రికార్డు సృష్టించిన న్యూజిలాండ్

టీ-20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసి జోషిమీదున్న టీమిండియా... వన్డే సిరీస్‌లో మాత్రం చేతులెత్తేసింది... ఓ ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ గెలవకుండా.. వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించింది.. ఇక, టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటుతారని భావించినా ప్రయోజనం లేదు అన్నట్టుగా ఉంది టీమిండియా తీరు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూఠగట్టుకుంది. తొలి టెస్టులో భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు. మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసిన భారత్.. నాల్గో రోజు బ్యాటింగ్ కొనసాగించి రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.. 58 పరుగులతో మయాంక్ అగర్వాల్, 29 పరుగులతో రహానే, 25 పరుగులతో పంత్ ఫర్వాలేదనిపించినా.. మిగతా ఆటగాళ్లు కనీస ఆటతీరును కనబర్చలేకపోవడంతో.. 191 పరుగులకే చాప చుట్టేసింది టీమిండియా.. ఇక, కివీస్ బౌలర్లలో సౌథీ 5/61, బౌల్ట్ 4/39తో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.. పదునైన బంతులతో భారత్ బ్యాటింగ్‎ను దెబ్బకొట్టారు.. దీంతో బ్యాట్స్‌మన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.. దీంతో, కివీస్‌ ముందు పెద్ద టార్గెట్‌ పెట్టలేకపోయారు.. అనంతరం 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు... ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని సాధించింది.. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో తొలి విక్టరీ కొట్టి... 1-0తే ఆధిక్యం సాధించింది న్యూజిలాండ్ జట్టు. ఇక, న్యూజిలాండ్ జట్టు టెస్ట్‌ల్లో 100వ విజయాన్ని నమోదు చేయడం మరో విశేషం.