న్యూజిలాండ్ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు మృతి

న్యూజిలాండ్ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు మృతి

న్యూజిలాండ్‌ మసీదుల్లో జరిగిన కాల్పుల ఘటనలో భారత్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు భారత హై కమిషన్‌ కార్యాలయం తెలిసింది. మహబూబ్‌ ఖోఖర్‌, రమీజ్‌ వోరా, ఆసీఫ్‌ వోరా, హన్సీఫ్‌ అలిబవ, ఓజైర్‌ ఖాదీర్‌ మృతి చెందినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వారు ఆదివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వారి పేర్లు, ఇతర సమాచారాన్ని ట్విటర్‌లో ఉంచారు. బాధిత కుటుంబాలకు వీసా జారీ కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక వెబ్‌పేజ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. దానికి సంబంధించిన నంబర్లను ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. 

మసీదుల్లో నరమేధం సృష్టించిన దుండగుడు ఘటనకు తొమ్మిది నిమిషాల ముందే తన కార్యాలయానికి సమాచారం అందించినట్లు ప్రధాని జసిండా అర్డెర్న్‌ వెల్లడించారు. ఈ మేరకు తన లక్ష్యాలను వివరిస్తూ రాసిన మేనిఫెస్టోను కార్యాలయానికి మెయిల్‌ చేసినట్లు తెలిపారు. అది తీవ్ర అతివాద భావజాలంతో ఉందని ఆమె వివరించారు. తనతో పాటు మరో 30 మందికి కూడా దుండగుడు సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రెండు నిమిషాల్లో ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. దుండగుడు దాడిని ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేశాడు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాని జసిండా ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారులను కోరారు. అలాగే సోషల్ మీడియాల్లో దాడికి సంబంధించిన వీడియోలు ఇంకా వైరల్ అవుతుండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌ మసీదుల్లో ఆస్ట్రేలియన్‌ ఉగ్రవాది శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.