కాల్పుల ఘటనతో.. టెస్ట్ మ్యాచ్ రద్దు

కాల్పుల ఘటనతో.. టెస్ట్ మ్యాచ్ రద్దు

బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య శనివారం ప్రారంభంకావాల్సిన టెస్టు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించింది. అంతకుముందు బంగ్లా ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆటగాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి అనంతరం వారు తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మూడో టెస్టు రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

శుక్రవారం ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో మృతిచెందిన వారిసంఖ్య 40 కిచేరింది. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనతో రెండు మజీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పెట్టారని తెలిపింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. 

మరోవైపు కాల్పుల ఘటనను పలువురు ప్రముఖులు ఖండించారు. పిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..  కాల్పుల ఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన విచారకరం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కివీ సోదరులు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’ అని మారిసన్‌ ట్వీట్ చేశారు.