తొలి టీ-20కి రెడీ.. విదేశీగడ్డపై దూకుడు చూపిస్తారా..?

తొలి టీ-20కి రెడీ.. విదేశీగడ్డపై దూకుడు చూపిస్తారా..?

ఈఏడాది టీమిండియా తొలి విదేశీ పర్యటన మొదలైంది. పూర్తి స్థాయి సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఈ టూర్‌లో మొత్తం ఐదు టీ ట్వంటీలు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇవాళ జరగబోయే ఫస్ట్‌ టీ ట్వంటీకి సిద్ధమైంది టీమిండియా. గత ఏడాది 4-1తో వన్డే సిరీస్‌ను గెలుచుకన్న కోహ్లీసేన... టీ-20సిరీస్‌లో మాత్రం పట్టు సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్‌ గెలువాలనే పట్టుదలతో ఉంది. ఇక ఐదేళ్ల తర్వాత కివీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. 

2018 ఆసీస్‌ టూర్‌ తర్వాత మూడు ఫార్మాట్లలో విదేశీ గడ్డపై టీమిండియా ఆడటం ఇదే తొలిసారి. దీంతో కివీస్‌ పిచ్‌లపై మనవారి ప్రదర్శన ఎలా ఉండబోతున్నది ఇంట్రెస్టుగా మారింది. అయితే, టెస్టులు వన్డేల్లో బెట్టర్ రికార్డు ఉన్నా... టీ ట్వంటీల్లో మాత్రం కీవిస్‌దే పైచేయిగా ఉంది. మరోవైపు విపరీతమైన గాలులతో కూడిన చల్లటి వాతావరణానికి అలవాటు పడేందుకు కోహ్లీ సేనకు కొద్ది సమయం అవసరం అని భావిస్తున్నారు. కివీస్ టూర్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది ఆసిస్‌ వేదికగా టీ-20 ప్రపంచకప్‌ జరగనుండటంతో...ఈ సీరిస్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. వరల్డ్‌కప్ ఆడే సమయానికి అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులపై అవగాహన వచ్చే అవకాశం ఉంది.