రెండో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం

రెండో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 325 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా వెళ్ళలేదు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (15), కొలిన్ మున్రో (31)లు శుభారంభం ఇవ్వలేదు. భారీ లక్ష్యం ఉండడంతో ఓపెనర్లతో సహా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20) దూకుడుగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు. సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (22), టామ్ లాథమ్ (34), హెన్రీ నికోలస్ (28), గ్రాండ్ హోమ్ (3) స్పిన్నర్ల బౌలింగ్ లో తడబడి తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. చివరలో బ్రాస్‌వెల్ (57: 46 బంతుల్లో 5x4, 3x6) అర్ధ శతకంతో కివీస్ స్కోర్ ను పెంచాడు. బ్రాస్‌వెల్ నిష్క్రమణ అనంతరం 40.2 ఓవర్లలో 234 పరుగులకి కివీస్ ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసాడు.

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియాకు మంచి శుభారంభం దక్కింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కొద్దీ వ్యవధిలో ధావన్‌ (66), రోహిత్ (87)లు అవుట్ అయ్యారు. కెప్టెన్ కోహ్లీ (43: 45 బంతుల్లో 5x4) బ్యాట్ ఝళిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వేగంగా ఆడే క్రమంలో కోహ్లీ పెవిలియన్ చేరాడు. అనంతరం ధోనీ (48 నాటౌట్: 33 బంతుల్లో 5x4, 1x6), అంబటి రాయుడు (47: 49 బంతుల్లో 3x4, 1x6), కేదార్ జాదవ్ (22: 10 బంతుల్లో 3x4, 1x6)లు ధాటిగా ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 324 పరుగుల భారీ స్కోర్ చేసింది. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' రోహిత్ శర్మకు దక్కింది. మూడో వన్డే సోమవారం ఉదయం జరగనుంది.