కివీస్ పై భారత్ ఘన విజయం

కివీస్ పై భారత్ ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్‌ మహిళల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందాన సెంచరీ చేయడంతో  9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మందానలు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మందాన విరుచుకు పడింది. ఈ క్రమంలో మందాన వన్డేల్లో నాలుగో సెంచరీ 105(104 బంతుల్లో 9 ఫోర్లు, 3  సిక్సులు) చేసింది. మరోవైపు జెమీమా కూడా దూకుడుగా ఆడుతూ అర్ధ సెంచరీ 81(94 బంతుల్లో 9 ఫోర్లు) చేసింది. వీరిని అవుట్ చేయలేక కివీస్ బౌలర్లు చాలా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. ఇద్దరు మొదటి వికెట్ కు ఏకంగా 190 పరుగుల భాగస్వామ్యంను నెలకోల్పారు. మందాన చివరలో విన్నింగ్ షాట్ ఆడబోయి ఔటైంది. మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ మిగతా పనిని పూర్తి చేసింది. దీప్తి శర్మ క్రీజ్ లోకి వచ్చినా ఒక్క బంతి కూడా ఆడలేదు. భారత మహిళల జట్టు 33 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 193 పరుగులు చేసింది.

అంతకుముందు న్యూజిలాండ్‌ 192 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్లు పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్ మూడేసి వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకుంది. కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. దేవినే (28), అమీ (31), అమేలియా (28) రాణించారు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' స్మృతి మందానకు దక్కింది.