వన్డేలో అత్యధిక స్కోరు చేసిన కివీస్ మహిళలు

వన్డేలో అత్యధిక స్కోరు చేసిన కివీస్ మహిళలు

అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో న్యూజిలాండ్‌ మహిళలు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. పురుషుల వన్డే మ్యాచ్ లో సైతం సాధ్యంకాని స్కోరును న్యూజిలాండ్‌  మహిళలు సాధించారు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక స్కోరు 444 పరుగులు పురుషుల పేరిట ఉంది. తాజాగా ఈ రికార్డును న్యూజిలాండ్‌ మహిళలు(490 పరుగులు) బద్దలుకొట్టారు. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 490 పరుగులు చేశారు. అనంతరం ఐర్లాండ్‌ మహిళలు144 పరుగులు మాత్రమే చేసి 346 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

మొదటగా టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. ఓపెనర్లు బేట్స్, వాట్కిన్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ క్రమంలో ఇద్దరూ బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా బేట్స్‌ చెలరేగి 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ దశలో జట్టు స్కోర్ 172 పరుగుల వాట్కిన్‌ పెవిలియన్ చేరింది. ఆ తర్వాత వచ్చిన గ్రీజ్ లోకి వచ్చిన గ్రీన్‌ కూడా బేట్స్ కు జతకలిసింది. అయితే ఒకే ఓవర్లో  రెండు సిక్సర్లు, ఫోర్‌ బాదిన బేట్స్‌(151).. జట్టు స్కోర్ 288 పరుగుల వద్ద అవుట్ అయింది. అనంతరం 62 బంతుల్లోనే గ్రీన్‌ శతకం పూర్తిచేసిన కొద్దిసేపటికి పెవిలియన్ బాట పట్టింది. ఇక ఇన్నింగ్స్ చివరలో కెర్‌(81 నాట్ అవుట్) భారీ సిక్సర్లు, ఫోర్లు బాదడంతో జట్టు స్కోరు 490 పరుగులకు చేరింది. ఐర్లాండ్‌ బౌలర్లు కారా ముర్రే (119), గ్యాబీ  లూయీస్‌ (92), లారా మారిట్జ్‌ (92), లౌజీ లిటిల్‌ (92), అమీ కెనలీ (81)లు భారీగా పరుగులు ఇచ్చారు. ఐర్లాండ్‌ బౌలర్ కారా ముర్రే రెండు వికెట్లు తీసింది.

అనంతరం 491 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మహిళలు 35.3 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసి.. 346 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూశారు. ఓపెనర్లు వాల్డ్రోన్(4), ఉనా(4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం లెవీస్(20), లారా(37) జీడీ ఆదుకునే ప్రయత్నం చేసినా.. భారీ స్కోరు  ముందుండటంతో ధాటిగా ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. ఆ తర్వాత గ్రాయ్(35)మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో తక్కువ పరుగులకే పరిమితమయింది ఐర్లాండ్. న్యూజిలాండ్ బౌలర్లలో కాస్పెర్క్ నాలుగు వికెట్లు తీసింది.