టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

టీ20 క్లీన్‌ స్వీప్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు కివీస్ సిద్ధమైంది. ఇ్పపటికే రెండు వన్డేలు ఓడి సిరీస్‌ కోల్పోయిన కోహ్లీసేన చివరి మ్యాచ్‌లోనైనా మెరుపులు మెరిపిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌ బే ఓవల్‌ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే టాస్‌ గెలిచిన కివీస్‌ బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి న్యూజిలాండ్ టూర్‌ను టీ20 క్లీన్‌ స్వీప్‌తో ప్రారంభించిన టీమిండియా అంతలోనే చతికిలపడింది. వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించింది. వారంరోజుల్లోనే పరిస్థితి అటు ఇటైపోయింది. బ్యాట్స్‌మెన్ కొంత బాగానే ఆడినా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ తప్పిదాలతో వన్డే సిరీస్‌ చేజార్చుకుంది.

ఆఖరి వన్డేలోనైనా గెలిచి క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. కొత్త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం అందిస్తున్నా వ్యక్తిగతంగా భారీ స్కోర్లు నమోదుచేయడంలేదు. పరుగుల భారమంతా రన్ మెషీన్ కోహ్లీ మీదే పడుతోంది. ముందునుంచే కోహ్లీని టార్గెట్ చేసిన కివీస్ బౌలర్లు.. భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇక మరోపక్క సిరీస్ గెలిచిన ఉత్సాహంలో కివీస్ ప్లేయర్లున్నారు. వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసి టీ20కి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ రావడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది. పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తుంది. మౌంట్‌ మాంగనూయ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ గెలిచింది. మరి ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.