చెత్తకుండి చిన్నారి... జర్నలిస్ట్ పేరెంట్స్

చెత్తకుండి  చిన్నారి... జర్నలిస్ట్ పేరెంట్స్

సమాజంలో ఆడపిల్లలంటే ఉన్న ఒక దారుణ రోగాన్ని నయం చేసేందుకు మోడీ ప్రభుత్వం 'బేటీ బచావో బేటీ పఢావో' నినాదం ఇచ్చింది. నిజంగా ఈ జబ్బు ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇవాళ్టికీ సిగ్గుపడుతున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఈ ప్రశ్న మరోసారి తలెత్తక మానదు. రాజస్థాన్ నాగౌర్ లోని ఒక చెత్తకుండిలో ఒక చిన్నారి పసిగుడ్డు విలవిల లాడుతూ కనిపించింది. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ చిట్టితల్లి తల్లిప్రేమకు నోచుకోలేదు. ఏ భయంతో ఆ కన్నపేగు ఈ పసిగుడ్డును తన నుంచి దూరం చేసుకుందో! ఎవరి భయంతో అనేదే ఇక్కడ ప్రశ్న? సోషల్ మీడియాలో ఈ బుజ్జి పాప వీడియో వైరల్ అయింది. వీడియోలో చెత్తకుండిలో ఆ పురిటిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తోంది.

Hit the link to see video: https://twitter.com/vinodkapri/status/1139424211494064129

ట్విట్టర్ లో వీడియో వైరల్ అయిన తర్వాత ఎందరో యూజర్లు ఆ పసికందు పక్షాన నిలబడ్డారు. ఎందరో యూజర్లు వీడియో అప్ లోడ్ చేసిన వ్యక్తి అడ్రస్ అడగడం ప్రారంభించారు. అప్పుడే మానవత్వానికి నిదర్శనం ఇస్తూ జర్నలిస్టులు సాక్షి జోషి, వినోద్ కాప్రి సోషల్ మీడియా ద్వారా ఆ పాపను దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు ప్రకటించారు. సాక్షి జోషి, వినోద్ కాప్రి ట్విట్టర్ ఇండియా సహాయంతో ఆ పసిగుడ్డు ఎక్కడ ఉందో గుర్తించారు. వెంటనే ఆ పసికందుకు సాయపడేందుకు ముందడుగు వేశారు. 'ఎవరైనా ఈ పాప గురించి ఎలాంటి సమాచారమైనా ఇవ్వగలరా? మేము అంటే నేను, వినోద్ కాప్రి ఈ పసిబిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నామని' సాక్షి జోషి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. 

Hit link to see the video: https://twitter.com/sakshijoshii/status/1139420496280223745

ఆ తర్వాత వినోద్ కాప్రి ట్వీట్ చేస్తూ 'ఈ రోదన ఇంక ఎంత మాత్రం వినలేకపోతున్నాను. ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి. మేము ఈ బిడ్డను మా జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నామని' రాశాడు. ఆ తర్వాత సుఖ్ దేవ్ దేవాసీ అనే యూజర్ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చాడు. ఈ వీడియో నాగౌర్ లోని బర్నేల్ గ్రామంలోదని తెలిసినట్టు చెప్పాడు.

Hit link to see the video: https://twitter.com/vinodkapri/status/1139430331608682496

కొన్ని గంటల తర్వాత వినోద్ కాప్రి లక్షలాది యూజర్ల గుండె భారం తగ్గేలా మంచి వార్త వినిపించాడు. పసిపాప క్షేమంగా ఉందని చెబుతూ ఒక కొత్త వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. తమ చిన్నారి దేవత ఇలా ఉందంటూ ఒక కొత్త ఫోటో పెట్టాడు. ఇప్పుడు పాప క్షేమంగా ఉందని బాగా కోలుకుంటోందని ఆమె కోసం ప్రార్థనలు కొనసాగించాలని కోరాడు. డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తాము దత్తత ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించాడు. బిడ్డ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పిన కాప్రి.. చిన్నారి పీహూ రెండు కిలోలు మాత్రమే బరువుందని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని వివరించాడు.

Hit link to see the video: https://twitter.com/vinodkapri/status/1139457083265257473

ఆ తర్వాత కాప్రి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ జూన్ 14 లాంటి పెద్ద రోజు జీవితంలో రాలేదు, రాబోదని రాసుకొచ్చాడు. ఇంట్లోకి ఓ చిన్నారి పొన్నారి పసిపాప అడుగుపెడుతోందన్న ఆలోచనే పులకరింతలు రేపుతోందని తెలిపాడు. దేశంలో దత్తత ప్రక్రియ సంక్లిష్టం, సుదీర్ఘంగా ఉంటుందని తమకకు తెలుసని అంటూనే మీ అందరి ప్రార్థనలు, ప్రేమతో మేం ప్రతి కష్టాన్ని దాటుకొని పాపను ఇంటికి తీసుకెళ్తామని నమ్మకం వ్యక్తం చేశాడు. వినోద్ కాప్రి, సాక్షి జోషి దంపతులిద్దరూ ఈ బిడ్డను దత్తత తీసుకోవాలని ఉందని ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఇద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులైన సాక్షి జోషి, వినోద్ కాప్రి వేసిన ముందడుగుని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుందని సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఆడపిల్లలు శాపంగా భావించే సమాజం ఆడపిల్లలు ఉంటేనే ఇల్లు కళకళలాడుతుందని గుర్తించాలి. కళ్లయినా తెరవని పసి ప్రాణాన్ని చెత్తకుండిలో పారేసిన తల్లిదండ్రులను తూర్పారబడుతూ సాక్షి జోషి, 'లక్ష్మిని ఇంటి నుంచి వెళ్లగొట్టడం కంటే వాళ్లకి ఇంకేం శిక్ష పడాలి? ఈ పాప పెరిగి పెద్దదై పేరు ప్రఖ్యాతులు సంపాదించినపుడు వీళ్లకు శిక్ష పడుతుందని' రాసింది.

Hit link to see the video: https://twitter.com/sakshijoshii/status/1139431512003104768

ఈ వార్తను ట్విట్టర్ లో వస్తున్న సమాచారం సేకరించి క్రోడీకరించి రాయడం జరిగింది.