మరో రెండు రోజులూ వర్షాలు...

మరో రెండు రోజులూ వర్షాలు...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గురువారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు, రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా... విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది యుద్ధప్రాతిపధిక పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరాఠ్వాడా నుంచి కోమెరిన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఈ రెండింటి ప్రభావంతో వానలు పడుతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.