లాభాలతో ప్రారంభమైన నిఫ్టి
పలు ప్రధాన వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో ఆ రంగానికి చెందిన షేర్లకు గట్టి మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్లు నీరసంగా ఉన్నా నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో 11035కి చేరింది. శుక్రవారం అమెరికా, యూరో మార్కట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే పరిస్థితి. జపాన్ నిక్కీ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు షాంఘై మాత్రం నష్టాల నుంచి కోలుకున్నట్లు కన్పిస్తోంది. మన మార్కెట్లలో ఆరంభంలో కాస్త మద్దతు లభించినా.. ఇది క్లోజింగ్ వరకు ఉంటుందా అన్నది అనుమానంగానే కన్పిస్తోంది. అమెరికా కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో యూపీఎల్ షేర్ 5శాతంపైగా లాభపడింది. ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఐటీసీ, గెయిల్ షేర్లు లాభపడిన నిఫ్టి షేర్లలో ముందున్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, రిలయన్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పనితీరు నిస్తేజంగా ఉండటంతో ఆ కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అలాగే బ్యాంక్ నికర లాభం భారీగా క్షీణించడంతో సౌత్ ఇండియన్ బ్యాంక్ 13 శాతం నష్టంతో ట్రేడవుతోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)