భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

ఏప్రిల్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌లు రేపటితో ముగియనుండటంతో... మార్కెట్‌లో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల బాగా క్షీణించిన ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు అనూహ్యంగా మిడ్‌ సెషన్‌ తరవాత కోలుకున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిసినా.. ఆసియా మార్కెట్‌ మాత్రం నష్టాలకే పరిమితమైంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌ వరకు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకుంది. మిడ్‌ సెషన్‌లో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన యూరో మార్కెట్లు అనూహ్యంగా భారీ లాభాల్లోకి మళ్ళాయి. దీంతొ మన మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముగిశాయి. ఒకదశలో 11578కి పడిపోయిన నిఫ్టి... క్లోజింగ్‌ సమయానికల్లా 10740 పాయింట్లకు చేరింది. క్లోజింగ్‌లో 150 పాయింట్ల లాభంతో 11726 వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్‌ 5.5 శాతం లాభపడింది. బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇక నిఫ్టి షేర్లలో నష్టాలతో ముగిసినవాటిలో టాప్‌ షేర్లు... టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, మారుతీ, కోల్‌ ఇండియా, సిప్లా ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌ షేర్లలో రిలయన్స్‌ నిప్పాన్‌ 11 శాతం పెరగ్గా, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 10 శాతం పెరిగింది. ఇన్ఫీబీమ్‌, సీజీ పవర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి. ఇక నష్టపోయిన టాప్‌ ఫైవ్‌లో... స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌, ఆర్‌ కామ్‌, హెక్సావేర్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి.