స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఉదయం నుంచి ఊగిసలాడిన నిఫ్టి స్వల్ప నష్టాలతో ముగిసింది. ఎన్డీఏ సర్కారుపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం.. మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిఫ్టి 28 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో,మెటల్‌, రియాల్టి షేర్లు భారీగా నష్టపోయాయి. మెటల్‌ షేర్లు మూడు శాతం పడ్డాయి. ఇవాళ ఆసియాతో పాటు యూరో మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గుతూనే ఉన్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 95ని దాటింది. దీంతో  చమురు, మెటల్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇవాళ లాభపడినవాటిల్లో నిఫ్టి షేర్లలో ఇండియాబుల్స్‌ హౌసింగ్స్‌ ఫైనాన్స్‌ నాలుగు శాతం పైగా లాభపడింది. ఓఎన్‌జీసీ రెండున్నర శాతం పెరిగింది. ఇక ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు కూడా 1 నుంచి 2 శాతం దాకా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌ ఏకంగా 5 శాతంపైగా నష్టపోయింది. ఇక మెటల్‌ షేర్లు హిందాల్కో, వేదాంత షేర్లు మూడు శాతం పడ్డాయి. యూపీఎల్, టాటా మోటార్స్‌  రెండున్నర శాతం తగ్గాయి. అశోక్‌లేల్యాండ్‌ ఏకంగా 14 శాతం క్షీణించింది.