భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలు స్టాక్‌ మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు డాలర్‌తో రూపాయి కేవలం ఒకే ఒక రోజులో అర్ధ రూపాయి క్షీణించడం, ఫార్మా కంపెనీలపై అమెరికా కేసులు కూడా మార్కెట్‌ను దెబ్బతీశాయి. అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న ట్వీట్లతో ప్రపంచ మార్కెట్లు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. చైనాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందోనన్న టెన్షన్‌ ప్రపంచ మార్కెట్లలో నెలకొంది. పైగా సౌదీకి చెందిన రెండు ఆయిల్‌ పడవలపై అగంతకుల దాడులతో ముడి చమురు ధరలు ఒక డాలర్‌పైగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఒక మోస్తరు నష్టాలతో అంటే 20 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన మార్కెట్‌ ఒకదశలో గ్రీన్‌లోకి వచ్చింది. కాని యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభం కావడంతో మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

ట్రేడింగ్‌ మరో 40 నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో ఫార్మా కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. సన్‌ ఫార్మా కేవలం ఆరు నిమిషాల్లో 20 శాతం క్షీణించింది. తరవాత కోలుకుని 5 శాతం నష్టంతో ముగిసినా... ఇతర ఫార్మా షేర్లలోనూ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలుస్తారన్న విశ్వాసం మార్కెట్‌లో సన్నగిల్లుతున్నట్లు కన్పిస్తోంది. దీంతో దాదాపు అన్ని కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 130 పాయింట్ల నష్టంతో 11148 వద్ద ముగిసింది. మే 23కు ముందు నిఫ్టి 11,000 లోపునకు నిఫ్టి చేరుతుందా అన్న అనుమానం మార్కెట్‌లో వ్యక్తమౌతోంది. లేదా ఇప్పటికే 700 పాయింట్లకు పైగా క్షీణించినందున మే 23కు ముందే చిన్న ర్యాలీ వస్తుందా అన్న అనుమానం మార్కెట్‌లో వ్యక్తమౌతోంది.

నిఫ్టిలో కేవలం  ప్రధాన షేర్లలో  పది షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రాటెల్‌, టెక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ లీవర్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌లూజర్స్‌లో ఐషర్‌ మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ ఫార్మా, ఇండియా బుల్స్‌ హౌసింగ్స్‌, ఎస్‌ బ్యాంక్‌ నిలిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు... మెర్క్‌, ఆస్ట్రాల్‌, జీఈ టీ అండ్‌ డీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, సెరా ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌ జాబితాలో ఐఆర్‌బీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, డెల్టా కార్పొరేషన్‌, సుజ్లాన్‌, జేపీ అసోసియేట్స్‌ ఉన్నాయి.