భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇటీవల బాగా పెరిగిన ఫార్మా షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నామా మాత్రపు నష్టాలతో ట్రేడవుతుండగా... మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాలతో క్లోజ్‌ కాగా.. యూరో మార్కెట్లు నామ మాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 119 పాయింట్లు, సెన్సెక్స్‌ 368 పాయింట్లు క్షీణించాయి. ఫార్మా తరవాత మెటల్‌, ఆటో, బ్యాంక్‌, ఎనర్జి, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా రంగాల షేర్ ల సూచీలు ఒకశాతం నష్టంతో క్లోజయ్యాయి. ముడిచమురు స్థిరంగా ఉంది, డాలర్‌లో కూడా మార్పులేదు. రూపాయి కూడా స్థిరంగా ఉంది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లోనూ మార్కెట్‌ రాణించకపోవడానికి కారణం... లిక్విడిటీ సమస్యగా పేర్కొంటున్నారు. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవాళ 16 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలోనే దాదాపు 12 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. తరవాతి స్థానంలో ఉన్న ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎల్‌, కోల్‌ ఇండియా షేర్లు రెండు శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఎల్‌ అండ్‌ టీ ఒకశాతంపైగా లాభంతో క్లోజైంది. ఇక నష్టాల్లో ముగిసిన షేర్లలో అదానీ టాప్‌లో నిలిచింది. అదానీ పోర్ట్స్‌ ఇవాళ 12.5 శాతం నష్టంతో క్లోజైంది. తరవాత ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్‌ ఆరున్నర శాతం క్షీణించగా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు అయిదు శాతం నష్టంతో ముగిశాయి. చురుగ్గా ట్రేడైన ఇతర షేర్లలో డిష్‌ టీవీ 8 శాతం దాకా లాభపడింది. అదానీ పవర్‌ ఏకంగా 18 శాతం క్షీణించింది.