భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, గురువారం ఏప్రిల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ ముగియనుండటంతో ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇటీవల భారీగా పెరిగి ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు ఇవాళ దారుణంగా క్షీణించాయి. ఎస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా క్షీణించాయి. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలకు అమెరికా ఇది వరకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. వాటిని ఎత్తివేస్తూ అమెరికా ఇవాళ నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వచ్చాయి. ఇలా రాయితీలు పొందుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. అమెరికా ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. దీని ప్రభావంతో ముడి చమురు ధరలు రెండున్నర శాతందాకా పెరిగాయి. దీంతో ఉదయం నుంచి మన మార్కెట్ల పతనం మొదలైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇవాళ ఉదయం కేవలం 25 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కొన్ని నిమిషాల్లోనే అమ్మకాల వెల్లువెత్తాయి. బ్యాంక్‌ నిఫ్టి భారీగా క్షీణించనారంభించింది. దీంతో నిఫ్టి ఒకదశలో 11,583కి పడిపోయింది. ఈస్టర్‌ సందర్భంగా యూరో మార్కెట్లకు సెలవు కావడంతో పతనం కొనసాగింది. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కన్పించినా.. క్లోజింగ్‌ దగ్గర పడే కొద్దీ ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో నిఫ్టి 158 పాయింట్ల నష్టంతో 11,594 పాయింట్ల వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ 495 పాయింట్లు క్షీణించింది. ఒక్క ఐటీ రంగ కంపెనీల షేర్లు మాత్రమే కాస్త గ్రీన్‌లో ఉన్నాయి. దీనికి కారణం ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి పతనం కావడమే. నిఫ్టి ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ షేర్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐఓసీలో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక బీఎస్‌ఇలో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు... కేపీఆర్‌ మిల్స్‌, ఏపీఎల్‌ లిమిటెడ్‌, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌, జీహెచ్‌సీఎల్‌, స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ ఉన్నాయి. ఇక నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లలో పీసీ జ్యువల్లర్స్‌, దీవాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, టాటా స్టీల్‌ (పీపీ), ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. ఇవాళ కూడా ఒకదశలో 31 శాతం క్షీణించిన జెట్‌ ఎయిర్‌వేస్‌... క్లోజింగ్‌కల్లా నష్టాలను పూర్తిగా భర్తీ చేసుకుని లాభాల్లోకి రావడం విశేషం.