భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు కాస్త కుదిటపడినట్లు కన్పిస్తున్నా... మన మార్కెట్లలో మాత్రం భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. సాధారణ ఎన్నికల ఫలితాలపై మార్కెట్‌లో గుబులు కన్పిస్తోంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతుంటే... వాటిని కొనే ఆర్థిక స్థితి దేశీయ ఫండ్ల వద్ద లేదు. దీంతో రిలయన్స్‌ వంటి షేర్లకు కూడా మద్దతు అందడం లేదు. పైగా ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి షేర్లకు ఎక్కడా మద్దతు అందకపోవడంతో ఆ షేర్లు కుప్పకూలుతున్నాయి. నిఫ్టి ఇవాళ కేవలం 19 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడి నుంచి మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడైన నిఫ్టి యూరో మార్కెట్లకు తీవ్రంగా రియాక్ట్‌ అయింది. జర్మీన డాక్స్‌ ఏకంగా 0.72 శాతం లాభం ప్రారంభం కాగా.. క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. దీంతో మిడ్‌ సెషన్‌ నుంచి భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో ఒకదశలో 11346కి క్షీణించింది. చివర్లో కాస్త షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో నిఫ్టి 138 పాయింట్ల నష్టంతో 11359 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 487 పాయింట్లు క్షీణించింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ 18 పైసలు క్షీణించింది. మరోవైపు ముడి చమురు ధరల్లో పెద్దగా మార్పు కన్పించలేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో హిందాల్కో, యూపీఎల్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్, సిప్లా టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. అయితే ఇవన్నీ ఒకశాతం మించి లాభపడలేదు. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవాళ ఏకంగా 10 శాతం క్షీణించింది. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు మూడు శాతం పైగా నష్టపోయాయి. సీజీ పవర్‌ 5 శాతం పెరగ్గా, ఐడియా 8 శాతం క్షీణించింది.
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో సీజీ పవర్‌, ఎడల్‌వైస్‌, ఆర్‌కామ్‌, ఫినొలెక్స్‌ కేబుల్‌, ఆర్‌సీఎఫ్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కాక్స్‌ అండ్‌ కింగ్‌, ఆస్ట్రాజెన్‌, కేఈఐ, రెడంగ్టన్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.