భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

డెరివేటివ్స్ చివరి వారంలో మార్కెట్‌ శుభారంభం చేసింది. వరుసగా 9 రోజుల నష్టాల తరవాత పుంజుకున్న మార్కెట్‌ ఇవాళ కూడా భారీ లాభాలు గడించింది. చైనా వస్తువులపై సుంకాలను విధింపును ఒక నెల వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఉదయం ఆసియా మార్కెట్లు భారీ లాభాలు గడించాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లు రెండు శాతంపైగా లాభపడ్డాయి. జపాన్‌, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు మాత్రం కేవలం అరశాతానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఆసియా మార్కెట్లతో ఊపుతో నిఫ్టి స్వల్ప లాభంతో ఆరంభమైంది. 10813 వద్ద ప్రారంభమైన నిఫ్టి కేవలం 15 నిమిషాల్లో 10788కి  చేరింది. ఇదే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. అక్కడి నుంచి మార్కెట్‌ క్లోజింగ్‌ వరకు ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. ఐటీ షేర్లు భారీ లాభాలు గడించాయి. ప్రభుత్వ బ్యాంకుల షేర్లు నిస్తేంగా ఉన్నాయి. అయితే ప్రైవేట్‌ బ్యాంకులు రాణించాయి. దాదాపు అన్ని రంగాల నుంచి మద్దతు అందడంతో 88 పాయింట్ల లాభంతో 10,880 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 341 పాయింట్లు లాభపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో టీసీఎస్‌ మూడు శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఇన్ఫోసిస్‌, గ్రాసిం, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు రెండు శాతంపైగా పెరిగాయి. ఇక నష్టపోయిన నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌ 8 శాతం పైగా నష్టపోయింది. ఇతర షేర్లలో స్వాన్‌ ఎనర్జి 20 శాతం, మదర్సన్‌ సుమి 11 శాతం పెరగ్గా... మాగ్మా, డీసీఎం శ్రీరామ్‌, కల్పతరు పవర్‌ ఏడు శాతం పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్లలో ఆర్‌ కామ్‌ 8 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ నాలుగు శాతం క్షీణించాయి.