భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

మార్చి నెలంతా స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు పండుగ వాతావరణం తలపించింది. మార్చి డెరివేటివ్స్‌ ఇటీవలికాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిసింది. ఒక్క ఎస్‌బీఐ షేర్‌ దాదాపు రూ. 50పైగా పెరిగింది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి అనూహ్యంగా పెరిగాయి. ఏ స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి రాకపోవడం, ఇంకేం పెరుగుతాయిలే అంటూ షార్ట్‌ చేసినవారు చివరి రోజుల్లో పొజిషన్స్‌ కవర్‌ చేసుకోవడానికి పరుగులు తీశారు. పీఎస్‌యూ బ్యాంకు షేర్ల సూచీ ఈ ఒక్క రోజే నాలుగు శాతం వరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క మెటల్స్‌ మినహా అన్ని రంగాల షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ఇవాళ 125 పాయింట్ల లాభంతో 11,570 వద్ద ముగిసింది. ఉదయం కేవలం 18 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లో 11452కి పడినా... ఆ తరవాత జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్ళింది. ఒకదశలో 11588 స్థాయిని తాకిన నిఫ్టి చివర్లో 11463 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 412 పాయింట్లు పెరిగింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9 శాతం లాభపడగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నాలుగు శాతం, యూపీఎల్‌ 3.5 శాతం లాభంతో ముగిశాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో హిందాల్కో, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు ఉన్నాయి. ఇతర షేర్లలో దీవాన్‌ హౌసింగ్‌ కూడా 9 శాతం పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్‌ 10 శాతం పెరగ్గా, సెంట్రల్‌ బ్యాంక్‌, దీవాన్‌ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌  9 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్‌ హోల్డింగ్స్‌ 8 శాతం పెరిగింది. ఇక పడిన షేర్లలో ఆర్‌ కామ్‌, టాటా స్టీల్‌ (పీపీ) ఎన్‌ఐఏసీఎల్‌, జేకే లక్ష్మీ,  జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఉన్నాయి.