లాభాలతో ముగిసిన నిఫ్టి

లాభాలతో ముగిసిన నిఫ్టి

బ్లూచిప్‌ షేర్ల అండతో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు, ఆసియా మార్కెట్లు లాభాలతో క్లోజ్‌ కాగా, యూరో మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌, ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. రూపాయి ఆరంభంలో భారీగా నష్టపోయినా.. తరవాత కోలుకుంది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 55 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి... తర్వాత 10,885కి పడినా క్రమంగా పుంజుకుని 10,987 స్థాయిని తాకింది. క్లోజింగ్‌లో స్వల్పంగా తగ్గి 10,961 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 192 పాయింట్లు లాభపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో రిలయన్స్‌ టాప్‌లో నిలిచింది. గతవారం చక్కటి ఫలితాలు చూపిన రిలయన్స్‌కు ఇవాళ కూడా భారీ మద్దతు లభించింది. ఈ షేర్‌ 4 శాతం పైగా లాభపడగా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2.7 శాతం పెరిగింది. బజాప్‌ ఫిన్‌ సర్వ్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు  రెండు శాతం పెరిగాయి. నష్టపోయిన నిఫ్టి ప్రధాన షేర్లలో హీరో మోటోకార్ప్‌ ఉంది. ఈ షేర్‌ 4 శాతం క్షీణించగా, ఎస్‌ బ్యాంక్‌ 3.73 శాతం తగ్గింది. విప్రో 2.8 శాతం, మారుతీ, బజాజ్‌ ఆటో 2 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్‌ లాభం 27 శాతం క్షీణించడంతో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌  8.36 శాతం నష్టంతో 14.25 వద్ద ముగిసింది.