భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

ప్రపంచ మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు పటిష్ఠంగా క్లోజ్ కాగా...  ఇవాళ ఆసియా  మార్కెట్లు అనూహ్య లాభాలతో ముగిశాయి. చైనా మార్కెట్లు రెండు శాతం పైగా లాభపడగా, జపాన్‌ నిక్కీ... హాంగ్‌సెంగ్‌లు కూడా ఒకశాతంపైగా లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలు గడించినా.. మిడ్‌సెషన్‌లో కాస్త ఒత్తిడి వచ్చింది. కాని యూరో మార్కెట్లు కూడా మంచి లాభాలతో ట్రేడ్‌ కావడంతో మన సూచీలు కూడా పుంజుకున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 80 పాయింట్ల లాభంతో 10,852 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. మెటల్‌, ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల సూచీలు ఒకశాతంపైగా లాభపడ్డాయి. నిఫ్టిలో 38 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి షేర్లలో ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌ బ్యాంక్‌ మూడు శాతం లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, వేదాంత, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రెండు శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. నష్టపోయిన షేర్లలో అల్ర్టాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, టైటాన్‌ ఒక శాతం పైగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో కార్ప్ కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. జేపీ అసోసియేట్స్‌ నాలుగుశాతంపైగా లాభంతో ముగిసింది.