మార్కెట్‌లో కొనసాగిన జోష్‌

మార్కెట్‌లో కొనసాగిన జోష్‌

విదేశీ ఇన్వెస్టర్ల డాలర్ల గలగలతో నిఫ్టి జెట్‌ స్పీడుతో పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉదయం స్వల్ప లాభంతో 11,326 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత 11,276 కి క్షీణించినా... వెంటనే కోలుకుంది. అక్కడి నుంచి క్లోజింగ్‌ వరకు లాభాల్లోనే కొనసాగుతూ  40 పాయింట్ల లాభంతో క్లోజైంది. సెన్సెక్స్‌ 216 పాయింట్లు లాభపడింది. మధ్య తరహా రంగానికి చెందిన షేర్లలో భారీ లాభాల స్వీకరణ కారణంగా అనేక షేర్లు నష్టాలతో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ రికార్డుస్థాయిలో 28,900ని దాటింది. ప్రైవేట్‌  బ్యాంకులకు మిడ్‌ సెషన్‌ తరవాత ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ షేర్లు కూడా జత కలిసింది. అయితే లాభాలన్నీ బ్లూచిప్‌ కంపెనీలకే పరిమితమైంది. ప్రధాన బ్యాంకు షేర్లు బాగా లబ్ది పొందాయి. అనేక ప్రైవేట్‌ బ్యాంకులు భారీగా లాభాలు పొందాయి. కాని నిఫ్టిలో మెజారిటీ అంటే 30 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముందున్నాయి. ఇక నష్టాల్లో ముందున్న నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, ఐఓసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ ఫార్మా, వేదాంత ఉన్నాయి. ఇతర షేర్లలో అలోక్‌ టెక్స్‌టైల్స్‌ 10 శాతం లాభంతో  క్లోజైంది.  ఇక బీఎస్‌ఈలో లాభాల్లో ముగిసిన షేర్లలో జస్ట్‌ డయల్‌, బీఈఎంఎల్‌, మన్‌ పసంద్‌, వెస్ట్‌ లైఫ్‌తో పాటు షెఫ్లర్‌ షేర్లు ఉన్నాయి.