భారీ లాభాల‌తో నిఫ్టి ఆరంభం

భారీ లాభాల‌తో నిఫ్టి ఆరంభం

అసెంబ్లీ ఫ‌లితాల‌ను స్టాక్ మార్కెట్ ఇదివ‌ర‌కే డిస్కౌంట్ చేసిన‌ట్లు క‌న్పిస్తోంది. అలాగే కొత్త ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ రావ‌డం కూడా మార్కెట్‌కు అనుకూల అంశ‌మే. ఉద‌యం ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో నిఫ్టి ఆరంభమైంది. ప్ర‌స్తుతం 70 పాయింట్ల‌తో 10620 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.సెన్సెక్స్ కూడా  2018 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. డాల‌ర్ ఇండెక్స్ 97.40పై ప‌టిష్ఠంగా ఉంది. ముడి చ‌మురు ధ‌ర‌లు ఒక శాతం పెర‌గ‌డంతో డాల‌ర్‌తో రూపాయి కాస్త బ‌ల‌హీనంగా ఉంది. ఉద‌యం 30 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డిన రూపాయి ఇపుడు స్థిరంగా ట్రేడ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్ల‌లో అన్ని రంగాల షేర్ల‌కు ఒక స్థాయి మ‌ద్ద‌తు లభించింది.

అన్ని రంగాల షేర్ల సూచీల గ్రీన్‌లో ఉన్నాయి. రియాల్టి, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ఐటీ వంటి రంగాల షేర్ల సూచీలు ఒక శాతంపైన లాభ‌ప‌డ్డాయి. ఇక నిఫ్టి ప్ర‌ధాన షేర్ల విష‌యానికొస్తే... ఇటీవ‌ల బాగా క్షీణించిన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు గ‌ట్టి మ‌ద్దతు ల‌భించింది. ఈ షేర్ 5 శాతం వ‌ర‌కు లాభాల‌తో ట్రేడ‌వుతోంది. ఎస్ బ్యాంక్‌, హీరో మోటో కార్ప్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో షేర్లు టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్‌లో ఉంది.ఈ షేర్ ఒక శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. ఏషియ‌న్ పెయింట్స్‌, కోల్ ఇండియా, హెచ్‌పీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నామ‌మాత్ర‌పు న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి.  యాక్టివ్‌గా ఉన్న ఇత‌ర షేర్ల బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగున్న‌ర శాతం పెరిగింది.