నష్టాలతో నిఫ్టి ప్రారంభం

నష్టాలతో నిఫ్టి ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మరిన్ని చైనా వస్తువులపై సుంకాలు విధిస్తామని అమెరికా చేసిన హెచ్చరికతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ ఒక్కటే గ్రీన్‌లో ముగిసింది. కాని ఉదయం నుంచి చైనా, హంగ్‌కాంగ్‌ మార్కెట్లు రెండు శాతం వరకు నష్టపోగా, జపాన్‌ నిక్కీ కూడా ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టి అర శాతం నష్టంతో ప్రారంభమైంది. 45 పాయింట్ల నష్టంతో 10,754 వద్ద ట్రేడైంది. నిఫ్టికి 10700 కీలక స్థాయి. నిఫ్టిలోని 50 షేర్లలో 41 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఫార్మా తప్ప మిగిలిన అన్ని షేర్ల సూచీలు రెడ్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి షేర్లలో లాభాలతో ట్రేడవుతున్నవాటిలో లుపిన్‌ ముందుంది. ఈ షేర్‌ ఒకశాతం లాభపడింది. బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు నష్టాల్లో ముందున్నాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ మూడు శాతం నష్టపోగా, ఐఓసీ రెండు శాతం నష్టంతో  ట్రేడవుతోంది. వేదాంత, ఐషర్‌ మోటార్స్‌ కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి.