నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

అధిక స్థాయిల వద్ద మార్కెట్‌ నిలదొక్కుకునేందుకు చాలా తంటాలు పడుతోంది. 22 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి మరికాస్త పెరిగి 11761కి చేరింది. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యేంత వరకు బాగానే  ఉంది. 2 గంటల తరవాత మార్కెట్‌ బలహీనపడటం ప్రారంభమైంది. గత నెలరోజులుగా నిఫ్టికి దన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో తొలిసారి గట్టి ఒత్తిడి ఎదురైంది. ఎస్‌బీఐ వంటి షేరు 2 శాతంపైనే నష్టపోయింది. దీంతో నిఫ్టి క్రమంగా క్షీణించి ఏకంగా 69 పాయింట్ల నష్టంతో 11643 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగియగా... యూరో మార్కెట్లు కూడా అదే బాటలో ఉన్నాయి. రేపు పరపతి విధానం ఉంది. దీంతో బ్యాంకు షేర్లలో ఒత్తిడి ఉంది.  ఈసారి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడంపై మార్కెట్‌లో భిన్న వాదనలు రావడం కూడా  మార్కెట్‌ బలహీనపడటానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఏప్రిల్‌ నెలలో మార్కెట్‌లో  అమ్మకాల ఒత్తిడి ఉంటుందని వదంతులు ఉన్నాయి. కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ కావడం, పోలింగ్‌ సరళి కూడా మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది.

ఇవాళ నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌ టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐఓసీ, గెయిల్‌, ఎస్‌బీఐ షేర్లు రెండు శాతం నుంచి 4.5 శాతం మధ్య నష్టంతో ముగిశాయి. కంపెనీలో వాటా కొనే విషయంలో సోనీ వెనక్కి వెళ్ళడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌లో ఒత్తిడి ఎక్కువైంది. ఐడియా ఇవాళ మరో అయిదు శాతం క్షీణించింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో జేపీ అసోసియేట్స్‌, టాటా స్టీల్‌ (పీపీ), దీపక్‌ ఫర్టిలైజర్స్‌, శారదా క్రాప్‌, ఓరియంట్‌ కెమికల్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన వాటిలో అమరరాజా బ్యాటరీస్‌ ముందుంది. ఈ షేర్‌ 6.75 శాతం క్షీణించింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి, ఐడియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, హెచ్‌పీసీఎల్‌ టాప్‌ లూజర్స్‌లో ముందున్నాయి.