మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్త మార్గదర్శకాలు ఇవే...

మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్త మార్గదర్శకాలు ఇవే...

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో... కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్ని నియంత్రించాలని, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పెంచాలని కోరుతూ... హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన నియంత్రణ చర్యలను కచ్చితంగా పాటించాలని... దీనికి స్థానిక జిల్లా, పోలీస్‌, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. డిసెంబరు 1 నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది హోంశాఖ. 

ఇక, కొత్త మార్గదర్శకాల ప్రకారం... కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌ను విధించలేవు. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షల్ని అమలు చేసుకోవచ్చు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను అందరూ తప్పకుండా ఉపయోగించాలని సూచించారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. కంటైన్‌మెంట్ జోన్‌ల గుర్తింపులో అధికారులు అప్రమత్తంగా ఉంటూ... వాటి జాబితాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయడంతో పాటు... హోం శాఖకు కూడా షేర్‌ చేయాల్సి ఉంటుంది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తారు. ప్రతీ ఇంటిపైనా పర్యవేక్షణ, నిఘా పెడతారు. వైద‍్యం, అత్యవసర సేవలు, అవసరమైన వస్తువుల సరఫరా మినహా ఈ జోన్లలో ప్రజల కదలికల్ని నియంత్రించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయాలని సూచించారు. 

మరోవైపు.. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన కేంద్ర హోంశాఖ... 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పింది. క్రీడాకారుల శిక్షణ కోసం మాత్రమే స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరుచుకోవచ్చు. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/వినోద/ విద్య/సాంస్కృతిక/మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదు. ఇతర కార్యక్రమాలకు 200 మందికి పైగా వ్యక్తుల్ని అనుమతించరు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులను నిబంధనల ప్రకారం అనుమతించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో మాస్క్‌ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని సూచించారు. మార్కెట్లు, వారాంతపు సంతలకు సంబంధించిన నిబంధనల్ని త్వరలో జారీ చేస్తారు. ఈ నిబంధనలు 2020 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు.