ఏ నిర్ణయమైనా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిందే... 

ఏ నిర్ణయమైనా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిందే... 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ ను నిర్వహించారు.  ఈ ప్రెస్ మీట్ లో అనేక విషయాలను పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల   నిర్వహణలో  ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, సుప్రీంకోర్టు తీర్పు తరువాత గవర్నర్ ను కలిసి ఎస్ఈసి గౌరవాన్ని కాపాడాలని కోరానని, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా   అధికారపార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని అన్నారు.  ఇద్దరు అధికారులపై తాను కక్షసాధింపు ధోరణితో వ్యవహరించలేదని,  ఉదయం సమావేశమంతా గిరిజాశంకర్ నేతృత్వంలోనే జరిగిందని తెలిపారు. హైదరాబాద్ లోనే ఉన్నా ఓటుహక్కును సరెండర్ చేసి దుగ్గిరాల ఓటుహక్కుకు అప్లై చేసినట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు. మీరు దుగ్గిరాలలో ఉండట్లేదు కాబట్టి ఓటుహక్కు ఇవ్వలేమని,  ఆ తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కలెక్టర్ ను తన ఓటుహక్కు కోసం అడుగుతానని తెలిపారు.  అప్పటికి ఇవ్వకుంటే తన హక్కు కోసంకోర్టుకు వెళ్తానని తెలిపారు. తాను మొదటి నుంచి ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉన్నానని,  ఏకగ్రీవాలపై విపక్షపార్టీల అభ్యంతరాలు తెలిపాయని, ఎన్నికలు మొదలయ్యాక అన్ని విషయాలు కమిషన్ పరిధిలోనే ఉంటాయని అన్నారు. ఏ నిర్ణయమైనా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిందేనని తెలిపారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే అని అయన అన్నారు. ఏకగ్రీవాల అడ్వర్టైజ్మెంట్ మీద సంజాయిషీ కోరినట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.  ఎంపీటీసీ, జెడ్పీటిసి ఏకగ్రీవాలపై కమిషన్ విచారణ జరుగుతుందని, తుదినిర్ణయం ఇంకా తీసుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.