'పవన్‌కల్యాణ్‌కు ఓట్లు పడ్డాయి.. సీట్లు రావు..!'

'పవన్‌కల్యాణ్‌కు ఓట్లు పడ్డాయి.. సీట్లు రావు..!'

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో ఎన్నికలు ముగిసిన ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఫలితాల కోసం ఈ నెల 23వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. అయితే, ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీకి ఓట్లు పడ్డాయి.. కానీ సీట్లు రావని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప... రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీకి యువకులతో పాటు మరికొన్ని వర్గాల ఓట్లు పడ్డాయి... కానీ, సీట్లు మాత్రం రావని అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులు టీడీపీ మళ్లీ గెలిపించడంలో దోహదపడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన చినరాజప్ప... మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున టీడీపీకే ఓటేశారన్నారు. మొదట 150 వస్తాయని అనుకున్నా... ఎన్నికల్లో పోటీ ఉన్న మాట వాస్తవమే నన్న ఆయన.. 100 నుంచి 105 స్థానాల వరకు టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలపై చంద్రబాబు పోరాటం చేస్తే ఓడిపోతున్నారనే ఇలాంటి కార్యక్రమం తీసుకున్నారని వైసీపీ ప్రచారం చేసిందని మండిపడ్డారు చినరాజప్ప. ఇక ఈ ఎన్నికల్లో  రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆరోపించారు. అందుకే ఎన్నికల కమిషన్ లో అధికారుల మధ్య చీలికలు వచ్చాయన్నారు. మరోవైపు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్ణయం పక్షపాతమన్న రాజప్ప... వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేశారని మండిపడ్డారు. చంద్రగిరిలోనూ టీడీపీయే గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చినరాజప్ప.