భారత్‌ పాస్‌పోర్ట్‌తోనే నీరవ్‌ ప్రయాణం

భారత్‌ పాస్‌పోర్ట్‌తోనే నీరవ్‌ ప్రయాణం

రూ. 13,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్‌ మోడీ ఇప్పటికీ భారత పాస్‌పోర్ట్‌తోనే ప్రపంచమంతా తిరుగుతున్నాడు. కుంభకోణం బయటపడిన వెంటనే మోడీ పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. అది కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన కూడా నీరవ్‌ మోడీ భారత పాస్‌పోర్టు ఉపయోగించి లండన్‌ నుంచి బ్రస్సయిల్‌కు వెళ్ళాడు. కాకపోతే విమానం బదలు ఆయన రైలులో ప్రయాణం చేశారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ అధికారులు కూడా తెలిపారు.

ఇంకా రద్దు కాలేదు...

నీరవ్‌ పాస్‌పోర్టు రద్దు విషయాన్ని ప్రపంచ దేశాలకు ప్రభుత్వం తెలుపలేదని తెలుస్తోంది. గతంలో చార్జిషీటు దాఖలు చేయకుండా ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేయగా.. వివిధ కారణాలు చూపి రెడ్‌కార్నర్‌ జారీ చేయని అంశాన్ని దర్యాప్తు సంస్థలు చెబతున్నాయి. అందుకే ఈ నెలలో చార్జిషీటు దాఖలు చేశాక.. ఇంటర్‌పోల్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. జూన్‌ 11న నీరవ్‌పై చార్జిషీటు దాఖలైంది. నీరవ్‌పై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలని తరవాత ఇంటర్‌పోల్‌ను కోరింది. ఇంటర్‌ పోల్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో నీరవ్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నీరవ్‌ అరెస్ట్‌ కాకుండా..  ఆయన తప్పించుకు తిరిగేందుకు మనవాళ్ళే సాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.