సాక్షులను చంపేస్తానని బెదిరిస్తున్న నీరవ్ మోడీ

సాక్షులను చంపేస్తానని బెదిరిస్తున్న నీరవ్ మోడీ

రూ.13,700 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ విచారణ కోసం శుక్రవారం రెండోసారి వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేయవద్దని భారత దర్యాప్తు సంస్థల తరఫు న్యాయవాది గట్టిగా వాదించారు. నీరవ్ మోడీ దర్యాప్తులో భారత ఏజెన్సీలకు సహకరించడం లేదని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఆరోపించింది. పైగా సాక్షులను చంపేస్తానని బెదిరిస్తున్నందువల్ల బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరారు. బయలికొస్తే నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేయడం, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీరవ్ మోడీకి బెయిల్ ఇస్తే ఆయన దేశం వదిలి పారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

అంతకు ముందు జిల్లా జడ్జి మేరీ మేలోన్ కోర్టు నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. నీరవ్ మోడీని స్కాట్లాంట్ యార్డ్ పోలీసులు సెంట్రల్ లండన్ లోని ఒక బ్యాంకు శాఖలో అరెస్ట్ చేశారు. కొత్తగా ఖాతా తెరిచేందుకు నీరవ్ మోడీ అక్కడకు వచ్చాడు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ మొదటి విచారణ సందర్భంగా నీరవ్ మోడీ దాదాపు రెండు బిలియన్ డాలర్ల మేర మనీ లాండరింగ్, మోసం కేసుల్లో మోస్ట్ వాంటెడ్ అని చెప్పింది. 9 రోజుల నుంచి నీరవ్ మోడీ పోలస్ కస్టడీలో ఉన్నాడు.

శుక్రవారం విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ కి సీబీఐ, ఈడీల సంయుక్త బృందం సహాయసహకారాలు అందించింది. మొదటి విచారణలో నీరవ్ మోడీ న్యాయవాదులు 5 లక్షల పౌండ్ల పూచీకత్తు ఇచ్చేందుకు, కఠిన షరతులకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. శుక్రవారం విచారణలో నీరవ్ మోడీ న్యాయవాదులు బెయిల్ పూచీకత్తు మొత్తాన్ని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం కోర్టులో నీరవ్ మోడీని హాజరు పరచడానికి ముందు భారత ఏజెన్సీలు అతనికి వ్యతిరేకంగా అదనపు సాక్ష్యాలు సమర్పించాయి. ఈడీ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అదనపు రుజువుల పత్రాలను కోర్టుకు అందజేసింది.