కూల్చివేతకు నీరవ్ మోడీ రూ.100 కోట్ల బంగ్లా

కూల్చివేతకు నీరవ్ మోడీ రూ.100 కోట్ల బంగ్లా

వజ్రాల వ్యాపారి, రూ.13,000 కోట్లకు పైగా పీఎన్బీని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన రూ.100 కోట్ల విలువైన అలీబాగ్ బంగ్లాను అధికారులు కూల్చేయనున్నారు. మహారాష్ట్రలోని అలీబాగ్ లో సముద్రానికి ఎదురుగా నిర్మించిన విలాసవంతమైన ఈ బంగ్లాను చట్టవిరుద్ధంగా నిర్మించారని రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రకటించింది. త్వరలో దీని కూల్చివేత చేపట్టనున్నట్టు తెలిపారు. 33,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సూపర్ లగ్జరీ బంగ్లాలో వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించి నీరవ్ మోడీ భారీ పార్టీలు ఇచ్చాడు. 

ఈ బంగ్లాను అక్రమంగా నిర్మించారని, దీని నిర్మాణానికి తీరప్రాంత నియంత్రణ పరిధి (సీఆర్ జడ్) నియమాలను ఉల్లంఘించడంతో పాటు రాష్ట్ర నిబంధనలను సైతం తుంగలో తొక్కినట్టు రాయగఢ్ జిల్లా కలెక్టర్ సూర్యవంశీ చెప్పారు. దీనిని పాక్షికంగా గ్రౌండ్ ప్లస్ వన్ నిర్మాణంగా నిర్మించారు 70,000 చదరపు అడుగులు విస్తరించిన ఈ బంగ్లాలో డ్రైవ్ వే, ఎత్తైన ఇనుప కంచె, భారీ భద్రతా గేటు ఉన్నాయి. ఉత్తర్వులు రాగానే జిల్లా యంత్రాంగం భవనం కూల్చివేత ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. 

ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలోని కిహిమ్ బీచ్ ఎదురుగా ఉంటే ఈ బంగ్లాని పర్యావరణ ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు అక్రమంగా ప్రకటించిన 58 భవనాల్లో ఒకటిగా ప్రకటించడం జరిగింది. పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, ఉన్నత వ్యాపారవేత్తలు, సినిమా, టీవీ ప్రముఖులు నీరవ్ మోడీ ఇక్కడ ఇచ్చిన చిన్నా పెద్ద పార్టీలకు హాజరయ్యారు.

నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ వార్తతో ఉలిక్కిపడింది. మొదట తాము అటాచ్ చేసిన ఈ భవనం కూల్చివేతను నిలిపేయాలని హైకోర్ట్ ని ఆశ్రయించింది. తర్వాత విలువైన వస్తువులను తీసుకొని జిల్లా యంత్రాంగానికి భవనం కూల్చివేతకు అప్పగించింది. ఈడీ అంచనాల ప్రకారం ఈ బంగ్లా విలువ రూ.100 కోట్ల పైమాటే.