దాడులు జరగొచ్చు, కేంద్ర బలగాలను పంపండి

దాడులు జరగొచ్చు, కేంద్ర బలగాలను పంపండి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఓటేసిన వారిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నందున అక్కడకు కేంద్ర బలగాలను పంపించాలని ఎన్నికల సంఘాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. బీజేపీపై కక్ష తీర్చుకుంటానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ హెచ్చరించారని తెలిపారు. మమతా కనుసన్నల్లోనే స్థానిక పోలీసులు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అందుకే ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ కేంద్ర బలగాలను పంపించి అల్లర్లు చెలరేగకుండా, ఎవరికీ హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఈసీని కోరారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో బీజేపీ దీటుగా తలపడింది. టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బెంగాల్‌లో బీజేపీ 11 స్ధానాలు గెలుచుకోనుంది. ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటింగ్‌ శాతం 17 నుంచి ఏకంగా 32 శాతానికి ఎగబాకనుంది. ఇక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ కేవలం ఒక స్ధానానికే పరిమితం కానుంది. కాగా, బెంగాల్‌లో బీజేపీకి 10 నుంచి 19 సీట్లు రావచ్చని మరికొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.