నిత్యానంద... నన్ను ఎవ్వరూ టచ్‌ చేయలేరు... ఎందుకంటే...?

నిత్యానంద... నన్ను ఎవ్వరూ టచ్‌ చేయలేరు... ఎందుకంటే...?

ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. నిత్యానందపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి. లెక్కలేనన్ని వివాదాలున్నాయి. కేసుల భయంతో ఎక్కడ తలదాచుకున్నాడో కూడా తెలియదు.. కానీ, తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోల మాత్రం తనను ఎవ్వరూ టచ్‌ చేయలేరని పేర్కొన్నారు నిత్యానంద. ఆ వీడియోను పరిశీలిస్తే.. "నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు... ఏ స్టూపిడ్ కోర్టూ నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు... నేను పరమశివుడిని... నేను నిజం చెప్పగలను.. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను" అంటూ తన శిష్యగణాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో లీక్‌ అయ్యింది. అయితే, అది ఎక్కడ? ఏ సందర్భంలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.. కానీ, ఆ వీడియో మాత్రం వైర్‌గా మారిపోయింది. 

మరోవైపు ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. ఓ సామ్రాజ్యాన్నే నెలకొల్పుతున్నాడనే వార్తలు వచ్చాయి.. తాను కొత్త దేశాన్నే క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ సర్కార్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆశ్రయం పొందేందుకు నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును కూడా తిరస్కరించినట్టు పేర్కొంది. మరోవైపు కేసులు వెంటాడుతుండడంతో నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక, రేప్ కేస్ సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద విదేశాలకు పారిపోతుంటే ఏం చేశారంటూ అటు కేంద్రం, ఇటు కర్ణాటక సర్కార్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి.