నిజామాబాద్ ఎన్నికల వాయిదా పై హైకోర్టులో విచారణ

నిజామాబాద్ ఎన్నికల వాయిదా పై హైకోర్టులో విచారణ

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలను వాయిదావేయాలంటూ తెలంగాణ హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. పిటీషనర్ తరుపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నామినేషన్ పత్రాలను పరిశీలించిన తరువాతే కేసును పరిశీలిస్తామని స్పష్టం చేసింది. సకాలంలో నామినేషన్ పత్రాలు కోర్టు అందలేదని న్యాయవాది రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సోమవారం వరకు రచనారెడ్డి గడువు కోరారు. ఎన్నికల నిబంధన ప్రకారం ప్రతి స్వతంత్ర అభ్యర్థికి గుర్తును కేటాయించాలని రచనా రెడ్డి కోర్టు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ జిల్లా రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎంపీ ఎన్నికను కనీసం 10 రోజులు వాయిదావేయాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న రైతులు చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో వారు గురువారం ఉదయం  హైకోర్టు‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ ఎన్నికలను రెండోవిడతలో నిర్వహించాలంటూ అన్నదాతలు విన్నవించుకున్నారు. తెలంగాణలోనే అత్యధిక స్థాయిలో 185 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో దాదాపు 170 మంది పసుపు, మొక్కజొన్న రైతులే ఉన్నారు.